ఈమధ్యనే నేనొక LCD టివి కొన్నాను. కొనేటప్పుడు చాల ఉత్సాహంగా మరియు ఆనందంగా కొన్నాను. కాని దాన్ని వాడటం మొదలు పెట్టాక కానీ అసలు సమస్య అర్ధం కాలేదు.
LCD టివి కొనక ముందు మా ఇంట్లో 21 అంగుళాల CRT కలర్ టివి ఉంది. క్లారిటీ బాగుంటుందని కేబుల్ కనెక్షన్ బదులుగా జీ టివి వారి డిష్ టివిని తీసుకున్నాను. పిచ్చ క్లారిటీ అని మురిసి పోయే వాడిని. ఆ ఉత్సాహంలోనే LCD టివి కొన్నాను. అదీ ఫుల్ HD. ఇంట్లో ఉన్న జీ టివి వారి డిష్ టివి మాములుది. దానితో క్లారిటీ తగ్గిందేమో అన్న అనుమానం మనసులో ఎక్కడో ఓ మూలన ముల్లులా గుచ్చుతు వుంది. దానితో మాములు డిష్ టివి బదులుగా ఫుల్ HD డిష్ టివి కనెక్షన్కు మారాలని అనుకున్నాను (ఇప్పుడు అన్ని డిష్ టివీల వారు HD డిష్ రిప్లేస్మెంట్ ను అందిస్తున్నారు).
మా ఇంట్లో PHILIPS కంపెనీ వారి DivX ప్లేయర్ ఉంది. CRT కలర్ టివి ఉన్నప్పుడు అది చాల మంచి ప్లేయర్ అనిపించేది. అన్ని రకాల ఫార్మాట్ లలో బొమ్మలు మరియు చిత్రాలు తిలకిన్చేవాడిని. కాని LCD టివి కొన్నాక తెలిసింది ఆ ప్లేయర్ ఫుల్ HD సినిమాలు సపోర్ట్ చెయ్యదని. ఇంకేముంది మనసులో అదో తెలియని వెలితి. దానితో ఉన్న PHILIPS కంపెనీ వారి DivX ప్లేయర్ని మార్చి HD సపోర్ట్ చేసే ప్లేయర్ తీసుకోవాలని అనుకున్నాను. దానికోసం ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.
ఇక చివరిగా సౌండ్ సిస్టం. మా ఇంట్లో 2 .1 ఛానల్ హోం దియేటర్ సిస్టం ఉంది. దానితోనే ఇప్పటివరకు సర్దుకు పోతూ వస్తున్నాను. (నిజానికి దానిని కూడా పూర్తిగా వాడింది లేదు. స్పీకర్లు ఆన్ చేస్తే వచ్చే సౌండ్ కు ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు. దానితో దానిని ఎప్పుడూ ఫుల్ సౌండ్ లో ఎంజాయ్ చేసింది లేదు.) LCD టివి తెచ్చాక మా స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. LCD టివిని మరియు 2 .1 ఛానల్ హోం దియేటర్ సిస్టంను చూసి ఒక సలహా విసిరేసాడు. LCD టివికి 5 .1 చానల్ హోం దియేటర్ సిస్టం ఉండాలే గానీ ఈ 2 .1 ఛానల్ హోం దియేటర్ సిస్టం చాలదు అని. ఇంకేముంది మనసు 5 .1 చానల్ హోం దియేటర్ సిస్టం పైకి మళ్ళింది. ఇక దానికోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. తీరా 5 .1 చానల్ హోం దియేటర్ సిస్టం కొనే సమయానికి షాపువాడు ఇంకో సలహా విసిరాడు. 5 .1 చానల్ హోం దియేటర్ సిస్టం ఎంజాయ్ చేయాలంటే ఒరిజినల్ DVD లనే ఉపయోగించాలి అని. లేకుంటే 5 .1 చానల్ హోం దియేటర్ సిస్టం పనికి రాదు అన్నాడు. మనకేమో ఇంటర్నెట్లో ఉచితంగా సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూసే అలవాటు. బాగా నచ్చిన సినిమాలు తప్ప, ఒరిజినల్ DVD లు పతి సినిమాకూ కొనే అలవాటు లేదు. ఇప్పుడు ఈ 5 .1 చానల్ హోం దియేటర్ సిస్టం కొనటం వల్ల ప్రతినెలా ఒరిజినల్ DVD లు కొనాలి. ఇకలాభం లేదని 5 .1 చానల్ హోం దియేటర్ సిస్టం కొనే ప్రోగ్రాం వాయిదా వేశాను.
అసలు నా సమస్యేంటో దానికి కారణం ఏంటో అర్దమయ్యేది కాదు. ఒకరోజు శుభోదయాన నాకు జ్ఞానోదయం అయింది. అసలు ఇన్ని సమస్యలు రావటానికి కారణం నేను కొత్తగా కొన్న ఫుల్ HD LCD టివి అని. అప్పటికి కానీ నా తప్పేంటో అర్ధం కాలేదు. అసలు LCD టివి కొనటం వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయని అనుకుంటే దాని జోలికి పోయ్యేవాడినే కాదు. తెలుసుకునే సరికి LCD టివి మా ఇంట్లోకి వచ్చేసింది.